search on

Friday, October 21, 2016

హైద్రాబాద్ ఆదాయంలో ఏపీకి వాట ఇస్తారా…

తిరుప‌తి వెంక‌న్న ఆదాయంలో 1987 ఎండోమెంట్ యాక్టు ప్రకారం 7 శాతం ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్‌కు, 5 శాతం కామన్ గుడ్ ఫండ్‌, అర్చక సంక్షేమ నిధికి 3 శాతం మొత్తం కలిపి 15 శాతం ఇవ్వాలని చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ హైకోర్టులో పిల్ వేయ‌డం కొత్త మ‌లుపు తిరిగింది. సుమారు వెయ్యికోట్ల పాత బ‌కాయిలు చెల్లించాలంటూ సౌంద‌ర రాజ‌న్ వేసిన ఈ పిల్ రెండు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ పిల్‌పై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. తిరుప‌తి ఆదాయంలో వాటా కోరుతున్న వారు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న‌ హైద‌రాబాద్ ఆదాయం విష‌యంలోనూ అదే విష‌యాన్ని పాటిస్తారా అని ప్ర‌శ్నించారు
సౌంద‌ర రాజ‌న్ పిటిష‌న్‌పై గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్పందిస్తూ తిరుమలకు ఎన్టీఆర్ స్పెషల్ స్టేటస్ ఇచ్చార‌ని, ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే ఉండాలని, ఈవోను నియమించాలని, మిగతా విషయాలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేశారని గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు గుర్తు చేశారు. ఆంధ్ర‌ప్రదేశ్‌ విభజన చట్టంలో 10వ షెడ్యూల్ లో ఉన్న 142 సంస్థలను 58:42 నిష్పత్తిలో ఆస్తులను పంచకుండా అడ్డుపడుతూ కొత్త వాద‌న‌ను తెర‌మీద‌కు తెస్తున్నార‌ని గాలి మండిప‌డ్డారు. హైదరాబాద్ నగరాన్ని అందరూ కలిసే అభివృద్ధి చేసుకున్నామ‌ని చెప్పిన ముద్దుకృష్ణమ‌ హైదరాబాద్‌లో 50 శాతం మంది ఏపీ వారున్నారని తెలిపారు. వీరు ట్యాక్స్‌లు కడుతున్నారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 22 జిల్లాల నుంచి 40 శాతం ఆదాయం వస్తే ఒక్క హైదరాబాద్ నుంచే 60 శాతం ఆదాయం వచ్చేదని గెలిపారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న‌తో హైదరాబాద్‌ను తెలంగాణకు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు 16 వేల కోట్ల రూపాయల లోటు, తెలంగాణ రాష్ట్రానికి 15 వేల కోట్ల రూపాయల మిగులు వచ్చిందని అన్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రికి సౌందర రాజన్ ఈ విష‌యాల‌ను చెప్పి హైదరాబాద్‌లో వచ్చే ఆదాయాన్ని పంచాల్సిందిగా కోరాల‌ని ఆయ‌న సూచించారు.

No comments:

Post a Comment