నిర్మాణ సంస్థ: యన్.టి.ఆర్.ఆర్ట్స్
తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్, శ్రీకాంత్, కోటేష్ మాధవ, నయన్(ముంబై), రవి(ముంబై) తదిరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ముఖేష్
ఎడిటింగ్: జునైద్
పాటలు: భాస్కరభట్ల
ఫైట్స్: వెంకట్
ఆర్ట్: జానీ
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్
హీరోలోని మాస్ యాంగిల్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ, సినిమాలో తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే దర్శకుల్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. అందుకే ఈ తరం యంగ్ హీరోలు అందరూ పూరి దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకుంటారు.టెంపర్ సినిమాలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై తన స్వరాన్ని వినిపించిన పూరి ఈసారి ఇజం సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ ద్వారా బ్లాక్ మనీపై గళం విప్పారు. ఇజం సినిమా ముందు వరకూ బొద్దుగా ఉన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడం విశేషం. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌కు టెంపర్‌తో సూపర్‌హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి, కళ్యాణ్‌రామ్‌కు ఎలాంటి సక్సెస్ ఇస్తాడోనని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. మరి పూరి, ఇజం ద్వారా ఏం చెప్పాడో చూద్దాం.....
కథ:
అండర్ వరల్డ్ డాన్ జావేద్ ఇబ్రహీం(జగపతిబాబు) ఎవరికీ తెలియని ద్వీపంలో ఉంటూ ఇండియాలో అండర్ వరల్డ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. జావేద్ కుమార్తె అలియా(ఆదితి ఆర్య). ఇండియాలో రాజకీయ నాయకులు అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల రూపాయలను జావేద్ తన బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్‌లో దాస్తుంటాడు. జావేద్‌కు ఇండియాలో కోటిలింగం(పోసాని కృష్ణమురళి) అనే సెంట్రల్ మినిష్టర్ సపోర్ట్ చేస్తుంటాడు. ఓ సందర్భంలో స్ట్రీట్ ఫైట్ చూడటానికి వెళ్లిన అలియాను, అక్కడ ఫైట్ చేయడానికి వచ్చిన సత్య మార్తాండ్(కళ్యాణ్‌రామ్) చూసి ప్రేమించి ఆమె వెంటపడతాడు. అలియాను కూడా సత్య తన ప్రేమలో పడేలా చేసుకుంటాడు. అయితే కథ అక్కడే మలుపు తిరుగుతుంది. సత్య మార్తాండ్‌ను కలవడానికి వచ్చిన జావేద్ ఉన్నట్టుండి తనపై కాల్పులు జరుపుతాడు.జావేద్ కాల్పుల నుండి సత్య తప్పించుకుంటాడు. ఇంత సత్య మార్తాండ్ ఎవరు? జావేద్‌కు, సత్యకు ఉన్న లింకేంటి? గ‌్రాండ్ లీకేజ్ వెబ్ సైట్‌కు,సత్యకు ఉన్న సంబంధం ఏమిటి? అసలు సత్య సమాజానికి ఏం చేయాలనుకుంటాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....
ప్లస్ పాయింట్స్
- కళ్యాణ్ రామ్ నటన
- అనూప్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
- పూరి డైలాగ్స్
మైనస్ పాయింట్స్
- ఫస్టాఫ్
- క్లైమాక్స్
విశ్లేషణ: 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇండియన్ కరెన్సీకి, డాలర్‌కు సమానమైన విలువ ఉండేది. కానీ ఇప్పుడు రూపాయి విలువ డాలర్ కంటే 70 శాతం వెనకబడింది. అందుకు కారణం. లంచం...ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరనీయకుండా మన దేశంలో రాజకీయ నాయకులు లక్షలు కోట్లు బ్లాక్ మనీని సంపాదించి ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో దాస్తున్నారు. దాని వల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగ సమస్య ఏర్పడమే కాకుండా రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం, ఆకలితో రోజుకు సగటు ఏడు వేల మంది దాకా చనిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ సమస్యలకు పరిష్కారం విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని మనదేశానికి రప్పించడమే. అలా వచ్చిన డబ్బులో పది శాతమో, ఇరవై శాతమో పేద వాళ్ల కోసం ఖర్చు పెడితే దేశంలో పేదరికం అనేది ఉండదు...అలా ఖర్చు పెట్టకపోతే అప్పుడు దేశంలోని సమస్యకు కారణం మనమే అవుతాం.. సింపుల్‌గా చెప్పాలంటే ఇజం కథాంశమిదే. ఈ పాయింట్‌ను చెప్పాలనుకున్న పూరి తనదైన స్టైల్లో ముఖంపై కొట్టేలా చెప్పాడు. స్వాతంత్రానికి ముందు తెల్లవాళ్లు దేశాన్ని దోచుకున్నారని చదువుకుంటున్నాం కానీ వాళ్లు మనకు రోడ్లు, రైలు, నౌకాయానం, విమానం, అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలను నేర్పించారు. కానీ స్వాతంత్ర్యం తర్వాత మనల్ని మనమే దోచుకుంటున్నాం..ఇప్పుడు మనం చదువుకోవాల్సిందే ఎప్పుడో దేశాన్ని దోచుకున్న తెల్లవాడి గురించి కాదు..ఇప్పుడు దేశాన్ని దోచుకుంటున్న నల్లవాడి గురించే...
బ్లాక్‌లో కొందామనుకున్నామంచివాడనేవాడు కనపడటం లేదు...వంటి డైలాగ్స్‌తో పూరి తనలో రచయితకు బాగానే పని చెప్పాడు. ఇంటర్వెల్ ముగిసిన తర్వాత నుండి ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాను పూరి ఆసక్తికరంగా నడిపాడు. అయితే ఎప్పటిలాగే ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్‌ను ఏడిపించడం, డాన్ జావేద్ దగ్గర రహస్యాలను రాబట్టం అనే కథాంశంతో ఫస్టాఫ్ చప్పగా ఉంది. ప్రీ క్లైమాక్స్‌లో క్లైమాక్స్ ఉంది. పూరి ఆ సంగతిని మరిచాడేమో..అక్కడ నుండి సినిమాను సాగదీయడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది.
కథ, కథనం విషయంలో పూరి మరింత జాగ్రత్త తీసుకుని ఉండుంటే సినిమా ఇంకా బావుండేదనిపించింది. ముఖేష్ సినిమాటోగ్రఫీ బావుంది. ముఖ్యంగా ఇటలీ అందాలను తన కెమెరాలో చక్కగా బంధించాడు. అనూప్ అందించిన సంగీతం కనులు నీవైనా అనే సాంగ్..హీరోయిన్ టీజింగ్ సాంగ్ బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే..కళ్యాణ్‌రామ్ నటనపరంగా మంచి మార్కులను కొట్టేశాడు. ముఖ్యంగా లుక్ విషయంలో కేర్ తీసుకుని సిక్స్ ప్యాక్ చేయడం విశేషం. పూరి టేకింగ్ వల్ల కళ్యాణ్‌రామ్‌లో కొత్త కోణం బయటకు వచ్చింది. హీరోయిన్ ఆదితి ఆర్య పాత్ర ఉండాలంటే ఉంది అన్నట్లు కనపడింది. పవర్‌ఫుల్ డాన్ అంటూ జగపతిబాబు చేసిన జావేద్ పాత్ర సినిమా ఆసాంతం తేలిపోయింది. ఈ పాత్రను జగపతిబాబులాంటి సీనియర్ హీరో చేయాల్సిందేనా అనే ఆలోచన వస్తుంది. వెన్నెల కిషోర్, అలీ కామెడి ఏదో ఉందంటే ఉందనిపిస్తుంది. తనికెళ్ల భరణి, ఈశ్వరీరావు, పోసాని తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.
బోటమ్ లైన్: గతి తప్పిన పూరి జర్నలి(ఇ)జం..
రేటింగ్: 2.5/5
No comments:
Post a Comment