- 32.5 లక్షల డెబిట్ కార్డుల డేటా చోరీ
- ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
దేశచరిత్రలోనే అతి పెద్ద డెబిట్ కార్డ్ ఫ్రాడ్ బయటపడింది. ఎస్ బ్యాంకు ఏటీఎం నెట్‌వర్క్ కోసం వినియోగించే హిటాచీ పేమెంట్ సర్వీసెస్ సర్వర్లలోకి మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టిన హ్యాకర్లు.. అక్షరాలా 32.5 లక్షల డెబిట్ కార్డుల వివరాలు దొంగిలించారు. ఈ చోరీ ఈ ఏడాది మే-జూలై నెలల మధ్య జరగ్గా.. సెప్టెంబరులో గుర్తించారు. దీనివెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదు. మాల్‌వేర్ బారిన పడ్డ 32.5 లక్షల కార్డుల్లో 26 లక్షల కార్డులు వీసా, మాస్టర్‌కార్డ్ ప్లాట్‌ఫాంపై పనిచేసేవి కాగా, రూపే కార్డులు 6 లక్షల దాకా ఉన్నాయి.ఎస్ బ్యాంకు వినియోగదారులతోపాటు.. ఆ బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు జరిపిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎ్‌ఫసీ వినియోగదారుల కార్డుల వివరాలు సైతం హ్యాకర్ల చేతిలో పడినట్టు సైబర్ భద్రత నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్డుల డేటా చోరీ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రోజుల క్రితమే అప్రమత్తమై 6 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసి సదరు వినియోగదారులు తమతమ శాఖలకు వెళ్లి కొత్త డెబిట్ కార్డులను తీసుకోవాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. కానీ.. అది ఎస్‌బీఐకే పరిమితం కాదని, చాలా బ్యాంకుల వినియోగదారులు ఈ మాల్‌వేర్ బారిన పడ్డారని ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో తెలిపింది. దీంతో, ఇప్పుడు మిగతా బ్యాంకులు కూడా నష్టనివారణ చర్యలకు నడుం బిగించాయి. వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాల్సిందిగా వినియోగదారులను కోరుతున్నాయి. మాల్‌వేర్ బారిన పడిన కార్డులను బ్లాక్ చేసి రీకాల్ చేసే పనిలో పడ్డాయి. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు మాత్రం కొన్నివారాల క్రితమే దీనిపై చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. తమ బ్యాంకు కార్డును ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో వాడిన వినియోగదారులను గుర్తించి.. వారి ఏటీఎం పిన్‌ను మార్చుకోవాల్సిందిగా సూచించినట్టు తెలిపింది. అలాగే.. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులు ముందుజాగ్రత్త చర్యగా పాతకార్డుల స్థానంలో కొత్తకార్డులను జారీ చేస్తున్నాయి.
డ్రాగన్ దేశంలో..
దొంగిలించిన కార్డుల వివరాల సాయంతో చైనాలో పలు లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఏపీ హోతా తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి భారతీయ బ్యాంకు సర్వర్లు, సిస్టమ్స్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపవలసిందిగా పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. బెంగళూరులోని పేమెంట్ సెక్యూరిటీ సంస్థ ఎస్‌ఐఎ్‌సఏను ఆదేశించింది. మాల్‌వేర్ ఎక్కడ, ఎలా ప్రవేశించిందో ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల తెలుస్తుందని హోతా అభిప్రాయపడ్డారు. ఇక.. డెబిట్‌కార్డుల డేటా చోరీపై మాస్టర్‌కార్డ్ స్పందించింది. తమ సిస్టమ్స్ ఎలాంటి భద్రత ఉల్లంఘనకూ గురికాలేదని స్పష్టం చేసింది. అలాగే, కార్డుల డేటా చోరీకి సంబంధించి వివరాలు తెలపాల్సిందిగా ఆర్థిక శాఖ బ్యాంకులను ఆదేశించింది. అలాగే.. దీనివల్ల ఎదురయ్యే చిక్కులేంటో తెలపాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను కోరినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. డేటా చోరీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అలాంటి భయాన్ని వీడాలని ఆర్థిక శాఖ సూచించింది. ‘‘దేశంలోని డెబిట్‌కార్డుల్లో కేవలం 0.5 శాతం కార్డుల వివరాలు మాత్రమే చోరీకి గురయ్యాయి. మిగతా 99.5 శాతం కార్డులూ సురక్షతమే. బ్యాంకు వినియోగదారులు ఆందోళన చెందవద్దు’’ అని ఆ శాఖలోని ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి జీసీ ముర్ము పేర్కొన్నారు. మేం కాదంటే.. మేం కాదు..
కార్డుల డేటా తస్కరణకు గురైంది! 32.5 లక్షల కార్డుల భద్రతకు ముప్పు ఏర్పడింది. ఈ రెండూ కంటి ముందు కనపడుతున్న వాస్తవాలే. కానీ.. తప్పు తమదగ్గర జరగలేదంటే తమ దగ్గర జరగలేదని ఎస్ బ్యాంకు, హిటాచీ సిస్టమ్స్ చెబుతున్నాయి. తప్పు హిటాచీ సిస్టమ్స్‌దేనని ఎస్‌బ్యాంకు పరోక్షంగా చెబుతుండగా.. తమ వద్ద ఎలాంటి సమస్యా లేదని.. ‘కావాలంటే ఈ రిపోర్టు చూడండి’ అని ఎక్స్‌టర్నల్ ఆడిట్ ఏజెన్సీ ఇచ్చిన నివేదికను హిటాచీ సిస్టమ్స్ చూపుతోంది. వారి వాదన ఎలా ఉన్నా.. ఇబ్బంది పడుతోంది మాత్రం వినియోగదారులు.
No comments:
Post a Comment